గరీబ్ కల్యాణ్ రోజ్గార్ యోజన ప్రారంభం – Garib kalyan rojgar yojana
గరీబ్ కల్యాణ్ రోజ్గార్ యోజన ప్రారంభం
కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల పనులకు దూరమైన వలస కూలీలకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన ‘గరీబ్ కల్యాణ్ రోజ్గార్ యోజన’ను ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 20న ప్రారంభించారు.
రూ. 50వేల కోట్లతో ఆరు రాష్ట్రాల్లో అమలు చేయనున్న ఈ పథకానికి బిహార్లోని కతిహార్ జిల్లాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ… గరీబ్ కల్యాణ్ రోజ్గార్ యోజనతో ఇక గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తాయన్నారు. పల్లెల్లో మౌలిక సదుపాయాలు పెరగడంతోపాటు ఇంటర్నెట్ లాంటి ఆధునిక వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు.
125 రోజులపాటు ఉపాధి…
గరీబ్ కల్యాణ్ రోజ్గార్ యోజన కింద ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో వలస కూలీలకు రూ.50 వేల కోట్లతో 125 రోజులపాటు ఉపాధి కల్పిస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 25 రకాల పనులను కూలీలకు అప్పగిస్తామని వెల్లడించింది. పేదలకు గృహ నిర్మాణం, చెట్లు నాటడం, ప్రజలకు తాగునీటి వసతి కల్పించడం, పంచాయతీ భవనాల నిర్మాణం, మార్కెట్లు, రోడ్ల నిర్మాణం వంటివి ఇందులో ఉన్నాయి.